Ambati Rambabu: పవన్ కల్యాణ్‌పై తీయబోయే సినిమాకి ఈ పేర్లు పరిశీలనలో ఉన్నాయి: అంబటి రాంబాబు
- బ్రో సినిమాలో తనను అవమానించేలా శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని ఆరోపణ
- నిత్య పెళ్లికొడుకు, పెళ్లిళ్లు-పెటాకులు, తాళి-ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు, మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు, మ్రో పేర్లు పరిశీలనలో ఉన్నాయని వెల్లడి
- రాజకీయంగా, సినిమాపరంగా పవన్ నిలిచే అవకాశం లేదని వ్యాఖ్య
- పవన్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందించారని ఆరోపణ
పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'బ్రో'పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. ఈ సినిమాలో తనను అవమానించేలా శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని ఆరోపించారు. పవన్ వ్యక్తిగత తీరుపై తాము కూడా ఓ సినిమా చేసే ఉద్దేశంతో కథను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. నిత్య పెళ్లికొడుకు, పెళ్లిళ్లు - పెటాకులు, తాళి - ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు, మూడు ముళ్లు - ఆరు పెళ్లిళ్లు, మ్రో (మ్యారెజెస్ రిలేషన్స్ అఫెండర్), అయిన పెళ్లిళ్లెన్నో.. పోయిన చెప్పులెన్నో.. అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాజకీయంగా, సినిమాపరంగా ఇక పవన్ నిలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. వారాహి అనే పవిత్రమైన పేరును పెట్టి అమ్మవారి వాహనాన్ని కాళ్ల కింద పెట్టుకొని పవన్ ప్రయాణిస్తున్నారన్నారు.
పవన్ నటించిన కొత్త సినిమా నిర్మాత టీడీపీకి చెందిన ఎన్నారై విశ్వప్రసాద్ అన్నారు. పవన్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందించారని ఆరోపించారు. బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి పవన్ కు అందించారని, అమెరికా నుండి పవన్ కు వస్తున్న డబ్బు పెద్ద స్కామ్ అని ఆరోపించారు. పవన్ తన సినిమాకు బ్లాక్ మనీని ఉపయోగిస్తున్నారా? అని ప్రశ్నించారు. పవన్ ఇంత వరకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? బ్రో సినిమాకు ఎంత తీసుకున్నారు? తన సినిమాలకు బ్లాక్ మనీని వాడుతున్నారా? చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు.