KCR: మహారాష్ట్ర కవికి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్
- ఈరోజు మహారాష్ట్రలో పర్యటించిన కేసీఆర్
- అన్నాభావు 103వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేసీఆర్
- అన్నాభావు గొప్పతనాన్ని మన దేశం గుర్తించలేదని ఆవేదన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా మహారాష్ట్రలోని వాటేగావ్ లో నిర్వహించిన అన్నాభావు (అన్నాభావు సాఠే) 103వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ... అన్నాభావు గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని చెప్పారు.
ఆయన గొప్పతనాన్ని రష్యా గుర్తించింది కానీ... మన దేశం గుర్తించలేదని కేసీఆర్ అన్నారు. రష్యాలోని లైబ్రరీలో అన్నాభావు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్పారు. వంచిత, పీడిత ప్రజల తరపున అన్నాభావు నిలిచారని కొనియాడారు. అన్నాభావు రచనలు మరాఠీలోనే ఉన్నాయని... వాటిని ఇతర భాషల్లోకి కూడా అనువదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన రచనలు ఏ ఒక్క సామాజికవర్గానికో పరిమితం కాదని... అవి అందరికీ సంబంధించినవని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మాతంగ్ సామాజికవర్గానికి సముచిత స్థానం లభించలేదని... బీఆర్ఎస్ పార్టీ తరపున వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తామని చెప్పారు.