Anakapalle: ప్రభుత్వ పథకాల కోసం అడ్డదారులు.. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు.. వలంటీర్ అరెస్ట్
- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఘటన
- అవివాహితుడైనా పెళ్లయినట్టు నకిలీ ధ్రువపత్రం తయారుచేసుకున్న డిజిటల్ సహాయకుడు
- పెళ్లయినా భర్తలతో విడిపోయినట్టు పత్రాలు సృష్టించుకున్న మహిళా పోలీసులు
- ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, సహకరించిన వలంటీర్ అరెస్ట్.. స్టేషన్ బెయిలుపై విడుదల
ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందేందుకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ కలిసి అడ్డదార్లు తొక్కారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీకి సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ అవివాహితుడు. డిజిటల్ కీ ఉపయోగించి పెళ్లయినట్టు నకిలీ వివాహపత్రం సృష్టించుకున్నాడు.
అదే సచివాలయంలోని మహిళా పోలీసులు బురుగుబెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నా విడాకులు తీసుకున్నట్టు నకిలీ పత్రాలు తయారుచేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వలంటీర్ నానాజీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు స్టేషన్ బెయిలుపై బయటకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు.