Bharathi Cements: జగన్ అక్రమాస్తుల కేసు.. భారతి సిమెంట్స్ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
- భారతి సిమెంట్స్ ఎఫ్ డీలను గతంలో స్వాధీనం చేసుకున్న ఈడీ
- ఎఫ్ డీలను వెనక్కి ఇచ్చేయాలంటూ టీఎస్ హైకోర్టు ఆదేశాలు
- హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఈడీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా భారతీ సిమెంట్స్ కు చెందిన ఫిక్స్ డ్ డిపాజిట్లను గతంలో ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఈడీకి ఆదేశాలను జారీ చేసింది. దీంతో, టీఎస్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో నిన్న వాదనలు జరిగాయి. ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలను వినిపించారు.
ఈ కేసుకు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు లేదా ఎఫ్ డీ లలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోర్టు చెప్పిందని... దీంతో, ఎఫ్ డీ లనే ఈడీ ఎంచుకుందని ధర్మాసనానికి ఎస్వీ రాజు తెలిపారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా కల్పించుకుంటూ... మీరు ఎఫ్ డీలను నగదుగా మార్చుకున్నారని ప్రతివాదులు చెపుతున్నారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని... దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. ఎఫ్ డీ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలన్న టీఎస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునే విషయాన్ని ప్రతివాదులకే వదిలేస్తున్నామని చెప్పారు.