Prime Minister: రక్షాబంధన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు చేరువ కావాలి: ప్రధాని
- బీజేపీ నేతలను కోరిన ప్రధాని
- ఎన్డీఏ ఎంపీలతో తొలి సమావేశం
- ట్రిపుల్ తలాక్ తో ముస్లిం మహిళల్లో విశ్వాసం పెరిగిందన్న మోదీ
రక్షా బంధన్ సందర్భంగా ముస్లిం మహిళలకు చేరువ కావాలంటూ బీజేపీ శ్రేణులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముస్లిం మహిళల భద్రత కోణంలో తీసుకున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం ముస్లిం మహిళల్లో నమ్మకాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. ప్రధాని మోదీ సోమవారం రాత్రి పశ్చిమబెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ ఎంపీలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ప్రధానితో పాటు, బీజేపీ నేతలు సమాజంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు.
2024 లోక్ సభ ఎన్నికల ముందు ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, తన భాగస్వామ్య పార్టీలతో కలసి ‘ఇండియా’గా ఏర్పడడమే కాకుండా కార్యక్రమాలను ఉద్ధృతం చేయడంతో.. దీటుగా బీజేపీ సైతం తన భాగస్వామ్య పక్షాలకు చేరువ అయ్యే ప్రయత్నాన్ని ఆరంభించడం తెలిసిందే. రక్షా బంధన్ సందర్భంగా మైనారిటీ మహిళలకు చేరువ అయ్యే కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని పిలుపు ఇచ్చినట్టుగా ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు వెల్లడించారు.
రక్షాబంధన్ అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీక అన్నది తెలిసిందే. హిందువులు చేసుకునే ఈ పండుగను ముస్లిం మహిళలకు చేరువ అయ్యేందుకు ఉపయోగించుకోవాలని ప్రధాని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీఏ ఎంపీలను ప్రాంతాల వారీగా క్లస్టర్ గా బీజేపీ వర్గీకరించింది. ప్రతీ క్లస్టర్ నుంచి 40 మంది ఎంపీలతో ప్రధాని సమావేశం అయ్యే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా జరిగిన తొలి సమావేశంలో సుమారు 45 మంది ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు.