USA: అధ్యక్ష ఎన్నికల ముంగిట చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్.. మరో కేసులో నేరాభియోగాల నమోదు
- గత ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో ట్రంప్‌కు చుక్కెదురు
- ఆయనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిన కోర్టు
- ఇప్పటికే రెండు తీవ్రమైన కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న ఆయనకు మరిన్ని కేసులు చుట్టుకుంటున్నాయి. తాజాగా 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ట్రంప్ పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ఆదేశాలు చేశారు. గత ఎన్నికల్లో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా యూఎస్ కాంగ్రెస్ ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడి వెనుక ట్రంప్ హస్తం ఉందని స్పెషల్ కౌన్సిల్ భావించారు. ఇక, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్ తమపై ఒత్తిడి తెచ్చారంటూ కొందరు అధికారులు వాంగ్మూలం కూడా ఇవ్వడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో గురువారం న్యాయస్థానం ఎదుట ట్రంప్ హాజరు కానున్నారు. కాగా, ట్రంప్ ఇప్పటికే రెండు తీవ్రమైన కేసుల్లో చిక్కుకున్నారు. ఓ శృంగార తారకు డబ్బులు చెల్లించిన కేసు, వైట్ హౌజ్ రహస్య పత్రాలను తరలించిన కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి.