New Delhi: హర్యానాలో హింస నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్
- హర్యానాలోని నుహ్ జిల్లాలో వీహెచ్‌పీ యాత్ర సందర్భంగా ఇరు వర్గాల ఘర్షణ
- అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించి ఆరుగురి మృతి
- నిన్న రాత్రి గురుగ్రామ్‌లో ఘర్షణలు జరగడంతో అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసు యంత్రాంగం
హర్యానాలో రెండు వర్గాల మధ్య హింస రాష్ట్రాన్ని అట్టుడికిస్తోంది. సోమవారం నుహ్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) చేపట్టిన యాత్ర సందర్భంగా మొదలైన ఘర్షణ ఇరు వర్గాల మధ్య హింసకు దారి తీసింది. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి. పలు ప్రాంతాలకు ఈ హింస వ్యాప్తి చెందడంతో ఇద్దరు హోంగార్డులు, ముగ్గురు పౌరులు, ఒక ఇమామ్‌తో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మత ఘర్షణల నేపథ్యంలో హర్యానా పోలీసులు 116 మందిని అరెస్టు చేసి, 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
మంగళవారం రాత్రి ఢిల్లీ సరిహద్దులో ఉన్న గురుగ్రామ్ నగరంలోనూ హింస చోటు చేసుకోవడంతో దేశ రాజధాని యంత్రాంగం అప్రమత్తమైంది. గురుగ్రామ్‌లోని సోహ్నా సబ్-డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం మూసివేశారు. నూహ్ ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గర వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని యోచిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రస్తుతం, నుహ్ హింసకు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢిల్లీలోని ఘోండా చౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా నడుస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు కూడా అప్రమత్తం అయ్యాయి. గస్తీని ముమ్మరం చేయడంతో పాటు వీహెచ్ పీ, బజరంగ్ దళ్ నిరసన చేపట్టిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు.