Cheetah: కొనసాగుతున్న చీతాల మరణాలు... మరో చీతా మృత్యువాత
- భారత్ లో 70 ఏళ్ల కిందట అంతరించిన చీతాల జాతి
- తిరిగి వృద్ధి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు
- ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకువచ్చిన వైనం
- ఇప్పటివరకు 9 చీతాల మృతి
భారత్ లో చీతాలు అంతరించిపోయిన నేపథ్యంలో, దేశంలో వాటి సంతతిని వృద్ధి చేయడం కోసమని ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకురాగా, ఆ చీతాలు వరుసగా మృత్యువాతపడడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చీతా కన్నుమూసింది. ఆ చీతా పేరు ధాత్రి. దాని ఆఫ్రికా నామధేయం తిబ్లిసి. కునో అభయారణ్యంలో ఇది చనిపోయి ఉండగా ఈ ఉదయం గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం, దీని మరణానికి గల కారణాలు వెల్లడి కానున్నాయి.
భారత్ లో చీతాలు 70 ఏళ్ల కిందట అంతరించిపోయాయి. దాంతో, గతేడాది కేంద్రం నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 20 చీతాలను తీసుకువచ్చింది. వీటిలో జ్వాల అనే ఆడ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో మూడు పిల్లలు మరణించాయి. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 9 చీతాలు మృత్యువాతపడ్డాయి.