Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
- మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు
- న్యాయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ సర్వే అవసరమేనని వ్యాఖ్య
- సర్వేపై సుప్రీంకోర్టు విధించిన స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు
జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగించేందుకు పురావస్తు శాఖకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. న్యాయ ప్రయోజనాల కోసం సర్వే జరగాల్సిన అవసరం ఉందంటూ గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. మసీదు ఆవరణలో సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తక్షణమే సర్వే కొనసాగించేందుకు ఓకే చెప్పింది.
కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదును మొఘలుల కాలంలో నిర్మించారని, అక్కడున్న ఆలయాన్ని కూల్చేశారని నలుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. మసీదు ఆవరణలో సర్వే జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన వారణాసి కోర్టు.. సర్వే జరిపేందుకు పురావస్తు శాఖను ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో సర్వే పురావస్తు శాఖ అధికారులు సర్వే మొదలు పెట్టగా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వే వల్ల మసీదు నిర్మాణం దెబ్బతింటుందని ఆరోపించింది. దీంతో సర్వేపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించి, అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలంటూ మసీదు కమిటీకి సూచించింది.
మసీదు ఆవరణలో సర్వే విషయంపై మసీదు కమిటీ అభ్యంతరాలు విన్న అలహాబాద్ హైకోర్టు.. సర్వేకు సానుకూలంగా తీర్పు వెలువరించింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను, అందులో పేర్కొన్న అభ్యంతరాలను తోసిపుచ్చింది. న్యాయ ప్రయోజనాల కోసం సర్వే అవసరమేనని, వెంటనే సర్వే చేపట్టాలని గురువారం తీర్పు వెలువరించింది.