volunteer: పంపిణీ చేయాల్సిన పింఛను డబ్బులతో పేకాడి.. కట్టు కథ అల్లిన వలంటీర్
- అనంతపురం జిల్లా విడపనకల్లులో ఘటన
- రూ. 89 వేల పింఛను సొమ్మును జూదంలో పొగొట్టుకున్న వలంటీరు
- ఇద్దరు దుండగులు బెదిరించి లాక్కున్నారని ఫిర్యాదు
- పోలీసుల విచారణలో అసలు విషయం ఒప్పేసుకున్న వైనం
పింఛను డబ్బులతో పేకాడేసిన ఓ వలంటీర్ ఆపై కట్టుకథలు చెప్పాడు. కొందరు దుండగులు తనను బెదిరించి ఎత్తుకెళ్లినట్టు చెబుతూ నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి పోలీసుల విచారణలో నిజం కక్కేశాడు. అనంతపురం జిల్లా విడపనకల్లులో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన వలంటీరు ఈ నెల 1న అధికారుల నుంచి రూ. 89 వేల పింఛను సొమ్ము తీసుకుని పంపిణీ చేసేందుకు వెళ్లాడు. అయితే, ఆ డబ్బుతో కర్నూలు జిల్లా గుమ్మనూరు సమీపంలోని ఓ పేకాట స్థావరంలో మంగాపత్త ఆడాడు. పింఛను సొమ్ముతోపాటు తన బంగారు ఉంగరం, సెల్‌ఫోన్ కూడా పోగొట్టుకున్నాడు.
జూదంలో డబ్బు పోగొట్టుకున్న విషయం బయట పడకుండా ఉండేందుకు పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. డబ్బుతో వెళ్తున్న తనను ఇద్దరు వ్యక్తులు బెదిరించి లాక్కున్నట్టు చెప్పాడు. రోడ్డుపై కనిపించిన ఇద్దరు వ్యక్తులు రూ. 20 వేల నగదు ఇస్తే ఆ మొత్తాన్ని ఫోన్ పే చేస్తామని చెప్పారని, దీంతో తాను రూ. 1000కి రూ. 10 కమిషన్ ఇవ్వాలని చెప్పానని పేర్కొన్నాడు. దానికి వారు ఒప్పుకుని కర్ణాటక సరిహద్దులోని ఓ గ్రామానికి తీసుకెళ్లి బెదిరించి డబ్బుతోపాటు ఉంగరం, సెల్‌ఫోన్ లాక్కున్నారని ఆరోపిస్తూ ఈ నెల 1న తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అతడి తీరును అనుమానించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పేసుకున్నాడు.