laptop: ల్యాప్ టాప్, టాబ్లెట్లు, కంప్యూటర్ల ధరలకు రెక్కలు?
- దిగుమతులపై ఆంక్షలు.. తక్షణం అమల్లోకి
- కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన
- దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు నిర్ణయం
ల్యాప్ టాప్, టాబ్లెట్ల దిగుమతులపై కేంద్ర సర్కారు ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. స్థానిక తయారీని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యమని తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇక మీదట కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ల దిగుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకుంటేనే సాధ్యపడుతుంది. ఆంక్షల పరిధిలో అవసరమైతేనే దిగుమతుల దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించనుంది.
కేంద్ర సర్కారు చాలా రంగాల్లో దేశీయ తయారీని కొంత కాలంగా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద వివిధ రంగాల్లో స్థానికంగా తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయినా కానీ చైనా తదితర కొన్ని దేశాల నుంచి చౌకగా దిగుమతులు వస్తుండడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను నీరుగారుస్తోంది.
దీంతో దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు తాజా ఆంక్షలను ప్రకటించింది. ఈ మూడింటిపైనే ఎందుకు ఆంక్షలు పెట్టిందనే సందేహం రావచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో మన దేశంలోకి దిగుమతి అయిన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ల విలువ 19.7 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చౌకగా మన దేశానికి వచ్చాయి.