Andhra Pradesh: ఏపీకి కేంద్ర సహకారం అందకూడదనే ఫిర్యాదులు చేస్తున్నారు: బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు
- ఏపీ అప్పులపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం
- ఏపీకి రూ.4.41 లక్షలకోట్ల అప్పు మాత్రమే వుందని పార్లమెంట్ సాక్షిగా వెల్లడైందన్న బుగ్గన
- చంద్రబాబు అప్పులు చేసినప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకారం అందకూడదనే విపక్షాలు ఫిర్యాదు చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అప్పులపై చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారని, కానీ పార్లమెంటులో కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. ఏపీకి మొత్తంగా రూ.4.41 లక్షల కోట్ల అప్పు ఉందని సభా ముఖంగా కేంద్రం తెలిపిందన్నారు. కానీ విపక్షాలు ఆరోపించిన రూ.10 లక్షల కోట్లు ఎక్కడ? అని ప్రశ్నించారు.
గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. తమకు తామే ఆర్థిక నిపుణులుగా ప్రకటించుకొని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వం ఇప్పటి కంటే ఎక్కువగా అప్పులు చేసిందని, అప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు.
వీరిది రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించ కూడదనే కుట్ర, రాష్ట్రానికి మంచి జరగకూడదనే ఆలోచన అన్నారు. ఆంధ్రప్రదేశ్.. శ్రీలంకలా మారుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, అసలు ఈ రాష్ట్ర అప్పులపై మాట్లాడేవారు ఎవరూ కూడా ఇక్కడ ఉండటం లేదన్నారు. ఆర్థిక శాఖ చెప్పే సమాధానాలు వీరు నమ్మరని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. వెయ్యికోట్ల అప్పు అంటూ ఐదుసార్లు రాస్తే రూ.5 వేల కోట్లు అవుతుందా? అని నిలదీశారు. చంద్రబాబు చేసిన అప్పులపై ఎందుకు మాట్లాడలేదన్నారు.