Sajjala Ramakrishna Reddy: వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందుతోంది.. చంద్రబాబులా మా ప్రభుత్వం హడావుడి చేయదు: సజ్జల
- చంద్రబాబుకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్న సజ్జల
- దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో అమలవుతోందని వ్యాఖ్య
- జగన్ కొత్త శకానికి నాంది పలికారన్న ప్రభుత్వ సలహాదారు
ప్రజా సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఆయన పాలన ప్రజలకు ఓ పీడకల అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... సంక్షేమంలో జగన్ కొత్త శకానికి నాంది పలికారన్నారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో అమలవుతోందని, ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అందుతోందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లేలా పాలన చేస్తున్నారనీ, జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతమైందని అన్నారు.
ఏపీలో కోటి 46 లక్షల కుటుంబాలను కలిశామన్నారు. అవినీతికి అవకాశం లేకుండా ప్రభుత్వ పథకాలు, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. పటిష్ఠమైన వ్యవస్థ వల్లే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తాము సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందుతోందని, చంద్రబాబులా తమ ప్రభుత్వం హడావుడి చేయదనీ అన్నారు. అక్కడకు జగన్ వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, తమ ప్రభుత్వం ఎవరికీ దోచి పెట్టడం లేదనీ అన్నారు.