FB Love: ఫేస్ బుక్ ప్రేమ.. ఇబ్బందుల్లో అంజూ కుటుంబం
- పాక్ వెళ్లి ప్రియుడిని పెళ్లాడిన భోపాల్ మహిళ అంజూ
- భార్య చేసిన పనికి ఉద్యోగం పోగొట్టుకున్న భర్త
- టైలర్ గా పనిచేసే అంజూ తండ్రికి ఉపాధి కరవు
- తొలుత సానుభూతి.. ఇప్పుడేమో అనుమానపు చూపులు
ఫేస్ బుక్ ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ వెళ్లిన మహిళ అంజూ ప్రస్తుతం అక్కడ బాగానే సెటిలయినట్లు తెలుస్తోంది. మతం మారి ఫాతిమాగా పేరు మార్చుకుని ప్రియుడిని పెళ్లాడింది. సరిహద్దులు దాటి వచ్చిన ఆమె ప్రేమకు మెచ్చి ఓ రియల్టర్ కొంత భూమిని, మరికొంత నగదును కానుకగా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ ఇండియాలోని అంజూ కుటుంబాన్ని మాత్రం ఇబ్బందులు చుట్టుముట్టాయి. అంజూ చేసిన పనికి తొలుత సానుభూతి వ్యక్తం చేసిన వారే ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు.
అంజూ భర్త ఉద్యోగం ఊడింది. అంజూ భర్త పనిచేస్తున్న కంపెనీ ఆయనను ఇంటికే పరిమితం కావాలని, కంపెనీ పేరును బయట పెట్టొద్దని సూచించినట్లు సమాచారం. తాము పిలిచే వరకు ఆఫీసుకు రావొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఆఫీసుకు రావొద్దన్నారు కానీ జీతం ఇస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. అంజూ మరిదిని కూడా సమస్యలు వెంటాడుతున్నాయి. వదిన చేసిన పనికి ఆయన కూడా ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
భీవాడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న అంజూ మరిదిని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. మరోవైపు, టైలర్ గా పనిచేసే అంజూ తండ్రికి ప్రస్తుతం ఉపాధి లేకుండా పోయింది. ఆయన దగ్గర బట్టలు కుట్టించుకునేందుకు స్థానికులు ముందుకు రావడంలేదని సమాచారం. భర్త, ఇద్దరు పిల్లలను వదిలి అంజూ ప్రియుడి కోసం వెళ్లడం, అక్కడ మతం మారి పెళ్లి చేసుకోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంజూ వల్ల తమ గ్రామం మీడియాకు ఎక్కిందని, ఇది తమకు తలవంపులుగా ఉందని మండిపడుతున్నారు.