Kedarnath yatra: గౌరీకుండ్ వద్ద భారీ ప్రమాదం.. కొండ చరియల కింద 12 మంది సజీవ సమాధి?
- గత రాత్రి నుంచి కురిసిన వర్షానికి ప్రమాదం
- కొండ చరియల కింద మూడు షాపుల ధ్వంసం
- 10-12 మంది ఆచూకీ గల్లంతు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేదార్ నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంతో అక్కడ కొన్ని షాపులు శిధిలాల కింద నేలమట్టం అయినట్టు తెలుస్తోంది. విపత్తుల స్పందన దళం వెంటనే రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 12 మంది వరకు శిధిలాల కింద చిక్కుకుని మరణించి ఉంటారని విపత్తు సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ అధికారి వెల్లడించారు.
కొండచరియల కింద మూడు షాపుల వరకు చిక్కుకున్నట్టు సమాచారం. గత రాత్రి నుంచి గౌరీకుండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం ఈ ప్రమాదానికి దారితీసింది. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ డాక్టర్ విశాఖ తెలిపారు. భారీ వర్షాల వల్ల కొండ చరియలు విరిగి పడ్డాయని, మూడు షాపులు వాటి కింద చిక్కుకుపోయినట్టు తమకు సమాచారం అందినట్టు చెప్పారు. 10-12 మంది వరకు చిక్కుకున్నట్టు భావిస్తుండగా, వారి ఆచూకీ ఇంతవరకు లభించలేదని వెల్లడించారు. తప్పిపోయిన వారి పేర్లను సైతం ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో గౌరీకుండ్ ఉంటుంది. ఇది కూడా పవిత్ర క్షేత్రమే. పార్వతీ దేవి పేరు మీదుగా గౌరీకుండ్ కు ఆ పేరు వచ్చింది. కేదార్ నాథ్ యాత్రీకులకు గౌరీకుండ్ బేస్ క్యాంప్ గా ఉంటోంది. అంతా కొండల మధ్య నడిచే కేదార్ నాథ్ యాత్ర అత్యంత రిస్క్ తో కూడుకున్నది. చిన్న వర్షానికే ఉన్నట్టుండి భారీ వరద పోటెత్తుతుంది.