Andy Flower: లక్నో సూపర్ జెయింట్స్ వద్దనుకుంది.. ఆర్సీబీ రమ్మంది..!
- ఆర్సీబీ హెడ్ కోచ్ గా ఆండీ ఫ్లవర్
- ట్విట్టర్ లో ప్రకటించిన బెంగళూరు ఫ్రాంచైజీ
- లక్నో హెడ్ కోచ్ గా రెండేళ్లు పనిచేసిన ఫ్లవర్
లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఆండీ ఫ్లవర్ రెండేళ్ల కాంట్రాక్ట్ ఇటీవలే ముగిసింది. దీంతో మరోసారి ఫ్లవర్ కు లక్నో ఫ్రాంచైజీ అవకాశం ఇవ్వలేదు. బదులుగా ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ను తమ హెడ్ కోచ్ గా లక్నో జట్టు నియమించుకుంది. దీంతో ఆండీ ఫ్లవర్ పై ఇతర ఫ్రాంచైజీలు కన్నేశాయి. పలు ఫ్రాంచైజీలు ఫ్లవర్ ను నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. చివరికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆండీ ఫ్లవర్ ను తమ కోచ్ గా నియమించుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
ఆండీ ఫ్లవర్ ను కోచ్ గా నియమించుకున్నట్టు ఆర్సీబీ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై ట్వీట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఆర్సీబీకి హెడ్ కోచ్ గా ఉన్న సంజయ్ బంగర్ కు ధన్యవాదాలు చెప్పింది. అలాగే, ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్ కు సైతం ధన్యవాదాలు తెలియజేసింది. గత సీజన్ పనితీరు సమీక్ష తర్వాత హెస్సన్, బంగర్ కాంట్రాక్టులను పొడిగించకూడదని నిర్ణయించినట్టు ఆర్సీబీ ప్రకటించింది.
‘‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్, టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ అయిన ఆండీ ఫ్లవర్ కు ఆర్సీబీ హెడ్ కోచ్ గా స్వాగతం పలుకుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా టీ20 జట్లు, లీగ్ ల్లో పనిచేసిన అనుభవం ఆండీకి ఉంది. తన జట్లు పీఎస్ఎల్, ఐఎల్టీ 20, ద హండ్రెడ్, అబుదాబి టీ10 టైటిల్స్ గెలుచుకునేందుకు ఆండీ నాయకత్వం పనిచేసింది. ఛాంపియన్ షిప్ ను గెలుచుకునే మనస్తత్వం అభివృద్ధి చేసేందుకు, ఆర్సీబీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆండీకి ఇవి సాయపడతాయి’’అని ఆర్సీబీ పేర్కొంది.