Rahul Gandhi: ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం.. సత్యమేవ జయతే: కాంగ్రెస్
- మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌కు ఊరట దక్కడంపై కాంగ్రెస్ స్పందన
- రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలన్న చిదంబరం
- న్యాయం గెలిచిందన్న రణ్ దీప్ సుర్జేవాలా
మోదీ ఇంటిపేరు కేసులో శిక్ష పడిన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో శుక్రవారం భారీ ఊరట దక్కింది. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ తీర్పు ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం... సత్యమేవ జయతే - జైహింద్ అని ట్వీట్ (ఎక్స్) చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరం స్పందించారు. గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ వెంటనే రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు. గత 162 ఏళ్లలో ఇలాంటి కేసుకు రెండేళ్ల శిక్ష విధించిన కోర్టు కేసును తాము కనుగొనలేకపోతున్నామన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు రాకుండా చేయాలనే ఏకైక ఉద్ధేశ్యంతో ఈ కేసును సిద్ధం చేశారని భావిస్తున్నామన్నారు. న్యాయం గెలిచింది.. ప్రజాస్వామ్య సభల్లో మళ్లీ సత్య గర్జన వినిపిస్తుంది అని రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.