Chandrababu: పుంగనూరు వెళుతున్నా... అక్కడ పుడింగి సంగతి తేలుస్తా: చంద్రబాబు

Chandrababu furious on YCP leaders

  • అంగళ్లు నుంచి ర్యాలీగా పుంగనూరు బయల్దేరిన చంద్రబాబు
  • చంద్రబాబుకు తమ గాయాలు చూపించిన టీడీపీ కార్యకర్తలు
  • పోలీసులు ఏంచేస్తున్నాంటూ టీడీపీ అధినేత ఆగ్రహం
  • డీఎస్పీ తన యూనిఫాం తీసేయాలని వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు తన మాటల్లో పదును పెంచారు. ఓవైపు నారా లోకేశ్ యువగళంతో కదం తొక్కుతుండగా, మరోవైపు చంద్రబాబు రాయలసీయ ప్రాజెక్టుల సందర్శన పేరుతో వైసీపీ నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. 

తాజాగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఘాటు వ్యాఖ్యలతో వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తలు తమకు తగిలిన గాయాలను చంద్రబాబుకు చూపించగా, ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. గాయపడిన కార్యకర్తలకు చికిత్స చేయించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. అనంతరం తీవ్రస్వరంతో వ్యాఖ్యలు చేశారు. 

"ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు... ఇక్కడి ఎమ్మెల్యేకి ట్యాగ్ అదే. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలి. పులివెందులకే వెళ్లాను... అంగళ్లుకు రాకూడదా? నేను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టాను. పెద్దిరెడ్డి పతనం అంగళ్లు నుంచే ప్రారంభమైంది. పుంగనూరు వెళుతున్నా... అక్కడ పుడింగి సంగతి తేలుస్తా" అని హెచ్చరించారు. 

టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. డీఎస్పీ తన యూనిఫాం తీసేయాలని అన్నారు. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా? ధైర్యం ఉంటే రండి... చూసుకుందాం అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

కాగా, అంగళ్లు నుంచి చంద్రబాబు ర్యాలీగా పుంగనూరు బయల్దేరారు. ఓపెన్ టాప్ వాహనంపై చంద్రబాబు నిలుచోగా, ఆయన కాన్వాయ్ వెంట భారీగా టీడీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నాయి.

  • Loading...

More Telugu News