YS Sharmila: బందిపోట్ల రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఆ దమ్ముందా?: షర్మిల ప్రశ్నల వర్షం
- ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖర రావుకు అసెంబ్లీ అంటే భయమెందుకని ప్రశ్న
- అసెంబ్లీ సెషన్స్లోను దొరగారు జనాలకు కనిపించరా? అని ఎద్దేవా
- అసెంబ్లీ సమావేశాల గడువును పెంచాలని డిమాండ్
- ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని నిలదీత
ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖర రావుకు అసెంబ్లీ అంటే ఎందుకు అంత భయమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజా సమస్యల మీద చర్చించే దమ్ము లేదా? కేవలం మూడు రోజులు అసెంబ్లీ నిర్వహించి, మీడియాలో మురిపించి తప్పించుకుందామని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు గడీల్లోంచి బయటకు వచ్చిన దొరగారు.. అసెంబ్లీ సెషన్స్లోనూ జనాలకు కనిపించడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల గడువు పొడిగించాలని, కేసీఆర్ రెండు దఫాల మేనిఫెస్టోపై, ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మీ డబుల్ టర్మ్ కి ఇదే ఆఖరి సెషన్ అన్నారు.
కేసీఆర్ దొర నిజంగా తెలంగాణ ప్రజల మేలుకోరే వారే అయితే మీ పాలన మీద మీకు నమ్మకమే ఉంటే, ఈ ఆఖరి సెషన్లో అయినా మేనిఫెస్టో మీద ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నియంతలా పాలించడం, దోచుకోవడం తప్ప మీకేం చేతనైందని ధ్వజమెత్తారు. ముమ్మాటికీ మీది బందిపోట్ల రాష్ట్ర సమితి, తాలిబన్ల రాష్ట్ర సమితి అని విమర్శించారు. ఎన్నికల సమయంలో బయటకు రావడం కాదని, తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదో చెప్పాలన్నారు. ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీలకు కేటాయిస్తామన్న రూ.50వేల కోట్ల నిధులపై చర్చించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ నోరు విప్పాలన్నారు. అమరుల కుటుంబాలకు ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. వీటన్నింటికి బందిపోట్ల రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖరుడికి సమాధానం చెప్పే దమ్ముందా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు.