Maharashtra: కోర్టు హాలులోనే రాజీనామా చేసిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి

Justice Rohit Deo of Bombay High Court resigns citing personal reasons

  • తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు చెప్పిన జస్టిస్ రోహిత్ డియో
  • మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగా రాజీనామా
  • ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని న్యాయవాదులతో చెప్పిన న్యాయమూర్తి 

బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. నాగ్‌పూర్‌లోని బాంబే హైకోర్టు బెంచ్ కోర్టు హాలులోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లు అక్కడే ఉన్న న్యాయవాది ఒకరు వెల్లడించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని చెబుతూ వైదొలిగినట్లు తెలిపారు. ఆ న్యాయమూర్తి రోహిత్ డియో అప్పటి వరకు వేర్వేరు కేసుల్లో వాదనలు విన్నారు. కానీ అంతలోనే రాజీనామా ప్రకటన చేయడం కోర్టు హాలులోని వారందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజీనామా సమయంలో ఆయన కోర్టు హాలులోనే కోర్టులో ఉన్న తమ అందరికీ క్షమాపణలు చెప్పినట్లు అక్కడున్న న్యాయవాది ఒకరు తెలిపారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నోసార్లు మీపై నేను ఆగ్రహం వ్యక్తం చేశానని, మిమ్మల్ని బాధపెట్టాలని అలా చేయలేదని, మీ నైపుణ్యత పెరగాలని మాత్రమే అలా అన్నానని, మీరు నా కుటుంబ సభ్యుల వంటి వారని, మీకు ఓ విషయం చెబుతున్నందుకు క్షమాపణలు అడుగుతున్నానని.. నేను నా పదవికి రాజీనామా చేశానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనని, అందరూ కష్టపడి పని చేయాలని సూచించినట్లు న్యాయవాది చెప్పారు.

కోర్టు వెలుపలకు వచ్చిన జస్టిస్ రోహిత్ డియో.. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు చెప్పారు. గత ఏడాది ప్రొఫెసర్ సాయిబాబాను జస్టిస్ రోహిత్ నిర్దోషిగా ప్రకటించారు. జీవిత ఖైదును కొట్టివేస్తూ ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మరోవైపు, నాగపూర్ - ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించి ఈ సంవత్సరం ప్రారంభంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై గతవారం స్టే విధించారు. ఆయన పదవీ కాలం 2025 డిసెంబర్ వరకు ఉండగా, రెండేళ్లకు ముందే రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News