Nara Lokesh: పెద్దిరెడ్డీ..! మా కార్యకర్తలు చిందించిన నెత్తుటిపై ఒట్టేసి చెబుతున్నా!: నారా లోకేశ్
- వైసీపీ అల్లరిమూకలు రాళ్లు రువ్వుతుంటే, పోలీసులు తమవారిపై లాఠీఛార్జ్ చేశారని ఆగ్రహం
- పుంగనూరులో ప్రజాస్వామ్యంపై వైసీపీ దాడి చేసిందన్న లోకేశ్
- పెద్దిరెడ్డి చేసిన పాపాలకు కుమిలి కుమిలి ఏడ్చే రోజు తెస్తామని వ్యాఖ్య
పుంగనూరు ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభకు వచ్చి వైసీపీ అల్లరిమూకలు రాళ్లు రువ్వుతుంటే, పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం సిగ్గుచేటు అన్నారు. పుంగనూరులో ప్రజాస్వామ్యంపై వైసీపీ చేసిన దాడి ఇది అన్నారు. మా కార్యకర్తలు చిందించిన నెత్తుటిపై ఒట్టేసి చెబుతున్నానని, పెద్దిరెడ్డీ.. నువ్వు చేసిన పాపాలన్నింటికీ కుమిలి కుమిలి ఏడ్చే రోజు తెస్తామని హెచ్చరించారు.
పాపాల పెద్దిరెడ్డి పాపాలు పండేరోజు దగ్గర పడిందన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు దాడులకు బరి తెగించారంటే వైసీపీ ఎంతటి అభద్రతాభావంలో ఉందో అర్థమవుతోందన్నారు. వైసీపీ గూండాలు రెచ్చిపోతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం రాజారెడ్డి రాజ్యాంగమే అన్నారు.
ప్లాన్ మార్చి గొడవ చేశారు: డీఐజీ అమ్మిరెడ్డి
పుంగనూరులో టీడీపీ నేతలు ప్లాన్ మార్చి గొడవ చేశారని అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను చంపడానికి ప్రయత్నించారన్నారు. పెద్ద పెద్ద రాళ్లతో పోలీసులపై దాడి చేశారని, ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడినట్లు చెప్పారు. రెండు వాహనాలను తగులబెట్టారన్నారు. నేతలు తమ కేడర్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ కేడర్‌ను రెచ్చగొట్టారన్నారు. టీడీపీ వెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో రూట్లో వెళ్లిందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామన్నారు.