RTC Bill: ఆ ఐదు అంశాలపై వివరణ ఇవ్వండి.. టీఎస్ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై
- ఆర్టీసీ విలీన బిల్లుపై ప్రభుత్వానికి గవర్నర్ ప్రశ్నలు
- ఉద్యోగుల ప్రయోజనాలపై సందేహం వ్యక్తం చేసిన తమిళిసై
- కార్మికుల భద్రతపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరిన గవర్నర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఇకపై ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం బిల్లును రూపొందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. దానిని గవర్నర్ అనుమతి కోసం రాజ్ భవన్ కు పంపించింది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని భావిస్తోంది. అయితే, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలుపలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు శనివారం ఉదయం ఆందోళన చేశారు. ఉదయం రెండు గంటల పాటు విధులు బహిష్కరించి రాజ్ భవన్ కు ర్యాలీ చేపట్టారు.
ఆర్టీసీ బిల్లును పరిశీలిస్తున్నానని తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలిపారు. బిల్లులో పలు అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలపై పలు సందేహాలు వ్యక్తం చేసిన గవర్నర్.. వాటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరారు. ఆర్టీసీ బిల్లులో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ ఇస్తారా లేదా అనేది వెల్లడించలేదని అన్నారు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్ విషయంలో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేసే విషయంపైనా స్పష్టత లేదన్నారు. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలను బిల్లులో పొందుపరచాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సూచించారు.