Ayurveda tips: పొద్దున్నే ఓ చెంచాడు నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు
- ఆవు నెయ్యితో మంచి కొలెస్ట్రాల్
- చెడు కొవ్వుల పని పట్టే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్
- పరగడుపున చెంచా ఆవు నెయ్యితో సాఫీ విరేచనం
- పేగులు, జీర్ణారోగ్యం బలోపేతం
నెయ్యికి మన భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. వెనుకటి కాలంలో దాదాపు అందరూ నెయ్యి తినేవారు. ఎక్కువ మందికి పాడి ఉండడంతో అది సాధ్యపడింది. ఆరోగ్యానికి నెయ్యి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. నేటి కాలంలో అల్లోపతి వైద్యులు నెయ్యికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. కానీ, స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు డాక్టర్ అవంతి దేశ్ పాండే తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
‘‘ఆయుర్వేదం ప్రకారం నెయ్యి తీసుకుంటే చిన్న పేగుల్లో ఆహార స్వీకరణ సామర్థ్యం పెరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ లో అసిడిక్ పీహెచ్ తగ్గుతుంది. పేగుల ఆరోగ్యం చక్కగా ఉంటే, దాదాపు చాలా వరకు అనారోగ్యాలు రావు. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, నిశ్చలమైన జీవనం, యాంటీబయాటిక్స్ వాడడం అన్నవి పేగుల ఆరోగ్యానికి హాని చేసేవి’’అని అవంతి దేశ్ పాండే వివరించారు.
నెయ్యిలో కొవ్వులు ఎక్కువ ఉన్నా సరే, అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు మేలు చేసే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దండిగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలమే. పైగా నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారన్నది అపోహ మాత్రమే. నెయ్యితో బరువు తగ్గుతారు.
‘‘నెయ్యి కొలెస్ట్రాల్ కు కారణం అవుతుందని చెప్పను. దీనికి బదులు కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుందంటాను. ఏ2 కౌ ఘీ (ఏ2 బీటా కేసిన్ ప్రొటీన్ ఉండే) మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులకు సాయపడుతుంది. ఫ్యాట్ లో కరిగే విటమిన్ ఏ, డీ, ఈ, కేని శరీరం మంచిగా గ్రహించేలా చేస్తుంది’’అని దేశ్ పాండే వివరించారు. అందుకే ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని తీసుకోవాలని ఆమె సూచించారు.
నెయ్యి జీర్ణ రసాల విడుదలను ప్రేరేపిస్తుంది. దాంతో తిన్నది చక్కగా అరుగుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చర్మం కాంతిని సంతరించుకుంటుంది. శరీరం మొత్తానికి కావాల్సిన లూబ్రికేషన్ ను అందిస్తుంది. పేగులను శుభ్రం చేస్తుంది. సాఫీ విరేచనానికి సాయపడుతుంది.