Manoj Tiwary: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బెంగాల్ క్రీడల మంత్రి

Bengal sports minister Manoj Tiwary announces retirement from all forms of cricket

  • గత ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి అందుకున్న మనోజ్ తివారీ
  • క్రికెటర్ గా 2022-23 రంజీ సీజన్ లో చివరి మ్యాచ్ ఆడేసిన వైనం
  • ఇన్ స్టాగ్రామ్ లో రిటైర్మెంట్ పై ప్రకటన
  • కుటుంబ సభ్యులకు, దేవుడికి కృతజ్ఞతలు

బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ... తన సొంత రాష్ట్రానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అని కూడా తెలిసిందే. గత ఎన్నికల్లో టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మనోజ్ తివారీ... మమతా బెనర్జీ క్యాబినెట్లో స్థానం సంపాదించాడు. 

గతంలో టీమిండియాకు కూడా ప్రాతినిధ్యం వహించిన తివారీ ఇప్పుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. 2022-23 సీజన్ లో రంజీ ఫైనల్ మ్యాచే తివారీకి చివరి క్రికెట్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో బెంగాల్ జట్టు సౌరాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. 

కాగా, తివారీ ఇన్ స్టాగ్రామ్ లో తన రిటైర్మెంట్ ప్రకటనను పోస్టు చేశాడు. క్రికెట్ వల్లే తాను ఇంతటివాడ్నయ్యానని, క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని భావోద్వేగాలు ప్రదర్శించాడు. కెరీర్ ఆద్యంతం వెన్నంటి ఉన్న కుటుంబ సభ్యులకు, భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. 

తివారీ టీమిండియా తరఫున 15 మ్యాచ్ లు ఆడాడు. 2008లో భారత జట్టుకు ఎంపికైన ఈ బెంగాల్ క్రికెటర్ 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. 

అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తివారీ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 141 మ్యాచ్ ల్లో 9 వేలకు పైగా పరుగులు సాధించాడు. అందులో 29 సెంచరీలు, 45 అర్ధసెంచరీలు ఉండడం విశేషం. ఐపీఎల్ లోనూ ఆడిన తివారీ 98 మ్యాచ్ ల్లో 1,695 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News