Bandi Sanjay: గవర్నర్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నమిది!: బండి సంజయ్
- ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ నాలుగేళ్లు ఆలోచిస్తే, గవర్నర్ ఆలోచించవద్దా? అని ప్రశ్న
- ఆగమేఘాల మీద స్టాంప్ వేసి అసెంబ్లీలో పెట్టడానికి ఆమోదం తెలపాలా? అని నిలదీత
- కార్మికులకు నష్టం కలగకూడదనే గవర్నర్ బిల్లును పరిశీలిస్తున్నారని వ్యాఖ్య
ఆర్టీసీ విలీనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లు ఆలోచించారని, గవర్నర్ కనీసం నాలుగు రోజులు ఆలోచించకూడదా? అని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆగమేఘాల మీద గవర్నర్ స్టాంప్ వేసి ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టడానికి ఆమోదం తెలపాలా? అని మండిపడ్డారు. ఈ బిల్లును హడావుడిగా పంపిస్తే అప్పుడు గవర్నర్ సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. గవర్నర్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు నష్టం కలగకూడదనే గవర్నర్ బిల్లును పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందలేదని బండి సంజయ్ అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. పాత పథకాలను తీసివేసి, కొత్త పథకాలను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.