Gaddar: గద్దర్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ స్పందన

Chandrababu and Lokesh reacts to Gaddar demise

  • గత కొన్నిరోజులుగా గద్దర్ కు అనారోగ్యం
  • హైదరాబాదులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు... దిగ్భ్రాంతికి గురైన లోకేశ్
  • ప్రజా ఉద్యమాల్లో ఒక శకం ముగిసిందన్న చంద్రబాబు
  • గద్దర్ అమర్ రహే అంటూ నినదించిన లోకేశ్

ప్రజా యుద్ధనౌక, జననాట్యమండలి సహ వ్యవస్థాపకుడు, జన ఉద్యమకారుడు గద్దర్ ఈ మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గద్దర్ మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్  చేశారు. తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని కొనియాడారు. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో, పౌర హక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసినట్టయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో గద్దర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.  

గద్దర్ ఇక లేడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను: లోకేశ్

గద్దర్ మృతి పట్ల నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందన్న సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. గద్దర్... విప్లవోద్యమాలకు తన పాటనిచ్చారని, తెలంగాణ ఉద్యమ గళం అయ్యారని లోకేశ్ కీర్తించారు. "ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల పాటకు జోహార్... ఉద్యమ గీతానికి జోహార్... గద్దర్ అమర్ రహే" అంటూ లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

  • Loading...

More Telugu News