CM KCR: గద్దర్ మృతిపై సీఎం కేసీఆర్ భావోద్వేగ స్పందన

CM KCR emotional response on Gaddar demise
  • ఈ మధ్యాహ్నం కన్నుమూసిన గద్దర్
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • చికిత్స పొందుతూ మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
  • తెలంగాణ సమాజం గొప్ప ప్రజాకవిని కోల్పోయిందని వెల్లడి
జన గాయకుడు, ప్రజా ఉద్యమకారుడు గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాట ద్వారా పల్లెపల్లెనా భావజాల వ్యాప్తి చేశారని కొనియాడారు. గద్దర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. 

సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా, తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. సాధారణ బుర్రకథా కళాకారుడిగా గద్దర్ కళాజీవితం ప్రారంభమైందని, ఆపై విప్లవ రాజకీయాలతో మమేకమైందని, తదనంతరం తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటం ద్వారా ఉన్నతస్థాయికి చేరిందని కేసీఆర్ వివరించారు. 

తెలంగాణ కోసం తన ఆటపాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిల్చారని, ప్రజా యుద్ధనౌకగా జన హృదయాల్లో నిలిచారని అభివర్ణించారు. గద్దర్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, ప్రజల కోసమే బతికాడని, గద్దర్ మృతితో తెలంగాణ సమాజం ఒక గొప్ప ప్రజాకవిని కోల్పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. కవిగా ప్రజా కళలకు, ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలు మరపురానివని కొనియాడారు. 

ఆయన లేని లోటును పూడ్చలేమని, ప్రజా కళాకారులకు, కవులకు మరణం ఉండదని తెలిపారు. ప్రజాకళలు వర్ధిల్లినంత కాలం గద్దర్ పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
CM KCR
Gaddar
Demise
Telangana

More Telugu News