Revanth Reddy: గద్దరన్న తో వ్యక్తిగతంగా నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది: రేవంత్ రెడ్డి
- ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయం
- నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి
- తన పాటతో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారన్న రేవంత్
- భూమి, ఆకాశం ఉన్నంతవరకు ఆయన స్ఫూర్తి ఉంటుందని వెల్లడి
హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గద్దర్ తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని అన్నారు. పీడిత ప్రజల గళమై వినిపించారని తెలిపారు.
గద్దరన్నతో తనకు వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉందని... భూమి, ఆకాశం ఉన్నంత వరకు ఆయనిచ్చిన స్ఫూర్తి ఉంటుందని రేవంత్ రెడ్డి భావోద్వేగాలకు గురయ్యారు. తుది దశ తెలంగాణ ఉద్యమం కోసం చివరి శ్వాస వరకు పరితపించారని వెల్లడించారు. తనలాంటివారికి ఉద్యమస్ఫూర్తిని నింపిన కవి, కళాకారుడు గద్దర్ అని కొనియాడారు. దొరల నుంచి తెలంగాణను కాపాడాలని తుది దశ ఉద్యమానికి అండగా నిలబడ్డారని కీర్తించారు.
రాహుల్ గాంధీకి గద్దరన్న పెట్టిన ముద్దు తడి ఇంకా ఆరలేదని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల ఓ సభలో రాహుల్ ను గద్దర్ ఆప్యాయంగా హత్తుకుని ముద్దు పెట్టిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఇవాళ గద్దరన్న భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు.
కాగా, గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.