Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై నిషేధం ఎత్తివేత.. మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత

Rahul Gandhi Is MP Again After Supreme Court Relief
  • రాహుల్ కు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు
  • సుప్రీం తీర్పుతో రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన లోక్ సభ సెక్రటేరియట్
  • వయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఆయనపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఆయన ఎంపీగా మళ్లీ పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. 

మోదీ ఇంటిపేరు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సూరత్ కోర్టు జడ్జి రాహల్ కు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయన ఎంపీగా అర్హతను కోల్పోయారు. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. సూరత్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో అప్పీలు చేసినప్పటికీ అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

రాహుల్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు ఊరటను కల్పించింది. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది. అయితే, ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని రాహుల్ కు సుప్రీంకోర్టు హితవు పలికింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ పై ఉన్న అనర్హతను లోక్ సభ సెక్రటేరియట్ ఎత్తివేసింది. రాహుల్ మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టనుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Rahul Gandhi
Congress
Lok Sabha
Membership
Restore
Disqualification

More Telugu News