Nara Lokesh: గన్ కంటే ముందే వస్తానని కోతలు కోశాడు... జగన్ ఎక్కడ?: నారా లోకేశ్
- మాచర్ల నియోజకవర్గంలో యువగళం
- కారంపూడిలో లోకేశ్ బహిరంగ సభ
- సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ యువనేత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు కారంపూడి శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్రకు నేడు 177వ రోజు కాగా... కారంపూడి తాండా, ఎన్ఎస్ పి కెనాల్, చెక్ పోస్టు, చెన్నకేశవస్వామి గుడి, వీర్లగుడి సెంటర్, సన్నిగుండ్ల మీదుగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
జూలకల్లు శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. జూలకల్లు శివార్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నేతృత్వంలో యువనేత లోకేశ్ కు ఘన స్వాగతం లభించింది. అంతకుముందు, కారంపూడి వీర్లగుడి సెంటర్ లో లోకేశ్ వాడీవేడిగా ప్రసంగించారు.
లోకేశ్ ప్రసంగం ముఖ్యాంశాలు...
అసలు దిశ చట్టమే లేదు... ఇదే రియాలిటీ
సైకో జగన్ పబ్లిసిటీకి, రియాలిటీకి ఎంత తేడా ఉంటుందో ప్రజలు తెలుసుకోవాలి. దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ స్కూటర్లు అంటూ హడావిడి చేశాడు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు వస్తానని కోతలు కోశాడు. రియాలిటీ ఏంటంటే... అసలు దిశ చట్టమే లేదు.
రెండు రోజుల క్రితం మదనపల్లిలో నడి రోడ్డు మీద లెక్చరర్ రుక్సానాని కిరాతకంగా పొడిచి చంపేశారు. ప్రాణహాని ఉందని అనేకసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో మరో దారుణం జరిగింది. వైసీపీ ఉప సర్పంచ్ కృష్ణమూర్తి ఆయన కుటుంబసభ్యులు కలిసి ముగ్గురు మహిళలపై దాడి చేశారు.
మల్లేశ్వరి, ఆమె కుమార్తెలు సౌజన్య, సునీతపై దారుణంగా దాడి చేసి చితకబాదారు. రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లారు. కనీసం కేసు నమోదు చేయకపోగా ఉపసర్పంచ్ ఇంట్లో బంగారం పోయింది అంటూ రివర్స్ కేసు పెడతాం అని పోలీసులు బెదిరించారు. పూటకో రేప్, రోజుకో మర్డర్ జరుగుతుంది. జగన్ ఎక్కడ? దిశ చట్టం ఎక్కడ?
జగన్ కు ఆ జబ్బు ఉంది!
జగన్ మైథోమానియా సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడం ఈ జబ్బు లక్షణాలు. మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్ధం చెబుతున్నాడు.
లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా గానీ పేదవాడ్ని అంటూ అబద్ధం చెబుతాడు. బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడా?
సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టీవీ, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. మైథోమానియా సిండ్రోమ్ వలన జగన్ అబద్ధాలు చెబుతూ అబద్ధంలోనే బ్రతికేస్తాడు.
100 సంక్షేమ పథకాలు రద్దుచేసిన జగన్
జగన్ ది రాక్షస మనస్తత్వం. ఎవరైనా సీఎం అయితే ప్రజలకు ఇంకా ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు. జగన్ మాత్రం ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. అన్న క్యాంటిన్ రద్దు, పండుగ కానుక రద్దు, పెళ్లి కానుక రద్దు, చంద్రన్న బీమా రద్దు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు, ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు, 6 లక్షల పెన్షన్లు రద్దు, డ్రిప్ ఇరిగేషన్ రద్దు.
ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం జగన్. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు.
45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు, మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2,500 కోట్లు కొట్టేశాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేశాడు.
మాచర్లను అభివృద్ధి చేసింది టీడీపీ!
తెలుగుదేశం పార్టీని గెలిపించకపోయినా 2014 నుండి 2019 వరకూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. రూ.2 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టీడీపీనే. గ్రామాల్లో సీసీ రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, డబుల్ రోడ్లు, టిడ్కో ఇళ్లు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, ఆఖరికి శ్మశానాలు కూడా అభివృద్ధి చేసింది టీడీపీనే.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. వరికెపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మాచర్ల పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తాం. మాచర్లలో ఉన్న 50 పడకల ఆసుపత్రి పరిధిని పెంచి అన్ని వైద్య సదుపాయాలతో 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ గా మార్పు చేస్తాం.
దుర్గి మిర్చి యార్డులో అన్ని వసతులు కల్పించి పూర్తిస్థాయిలో అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. అవసరమైన మేర కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం.
====
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2354.1 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 10.7 కి.మీ.*
*178వరోజు (8-8-2023) యువగళం వివరాలు*
*గురజాల అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*
ఉదయం
8.00 – జూలకల్లు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – జూలకల్లులో స్థానికులతో సమావేశం.
10.00 – పందిటివారిపాలెం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
మధ్యాహ్నం
12.00 – జానపాడు శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – జానపాడు శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – జానపాడులో స్థానికులతో సమావేశం.
6.00 – పిడుగురాళ్ల కన్యకాపరమేశ్వరి గుడి వద్ద బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.
7.15 – పిడుగురాళ్ల ఘంటసాల విగ్రహం వద్ద ముస్లింలతో సమావేశం.
7.35 – పిడుగురాళ్ల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.
9.05 – పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ విడిది కేంద్రంలో బస.
******