USA: అమెరికా నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్... తీవ్రస్థాయిలో స్పందించిన అగ్రరాజ్యం
- ఎర్రసముద్రంలో తమ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుందని అమెరికా ఆరోపణ
- 3 వేల మంది సైనికులను తరలించిన అగ్రరాజ్యం
- ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత
అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ మరోసారి ఆగ్రహం తెప్పించింది. కొన్నిరోజుల కిందట అమెరికాకు చెందిన ఓ వాణిజ్య నౌకను ఇరాన్ బలగాలు స్వాధీనం చేసుకోవడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది. ఇరాన్ చర్య పట్ల తీవ్రస్థాయిలో స్పందించిన అగ్రరాజ్యం వెంటనే రెండు నౌకల్లో 3 వేల మంది సైనికులను ఎర్ర సముద్రానికి తరలించింది. ఈ మేరకు అమెరికా 5వ ఫ్లీట్ కమాండర్ నుంచి ప్రకటన వెలువడింది.
కాగా, ఇటీవల కాలంలో ఎర్ర సముద్రం అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన తమ నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తమ నౌకల జోలికి వస్తే ఇరాన్ కు తగిన బుద్ధి చెప్పేందుకే తాజాగా అమెరికా పెద్ద సంఖ్యలో బలగాలను ఎర్ర సముద్రానికి తరలించినట్టు భావిస్తున్నారు. అమెరికా బలగాలు మోహరించిన నేపథ్యంలో ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది.