Ambareesh Murty: ముంబై నుంచి లడఖ్‌కు బైక్ రైడ్.. గుండెపోటుతో ‘పెప్పర్ ఫ్రై’ సీఈవో మృతి
- ఇటీవల ముంబై నుంచి లేహ్‌కు బైక్‌పై వెళ్లిన అంబరీశ్ మూర్తి
- నిన్న గుండెపోటుతో మృతి
- వెల్లడించిన ‘పెప్పర్ ఫ్రై’ సహ వ్యవస్థాపకుడు ఆషిశ్ షా
ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ‘పెప్పర్ ఫ్రై’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అంబరీశ్ మూర్తి (51) హఠాన్మరణం చెందారు. మోటార్ సైకిల్‌పై ముంబై నుంచి లడఖ్‌లోని లేహ్ టూర్‌కు వెళ్లిన ఆయన.. గుండెపోటు (కార్డియాక్ అరెస్టు)తో అక్కడ చనిపోయారు. ఈ విషయాన్ని ‘పెప్పర్ ఫ్రై’ సహ వ్యవస్థాపకుడు ఆషిశ్ షా వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘‘నా స్నేహితుడు, గురువు, సోదరుడు, సహచరుడు అంబరీశ్ మూర్తి ఇక లేరు అని తెలియజేయడానికి చింతిస్తున్నా. నిన్న రాత్రి లేహ్ వద్ద గుండెపోటుతో ఆయన చనిపోయారు. దయచేసి ఆయన కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి” అని ఆషిశ్ షా పేర్కొన్నారు. అంబరీశ్ మరణ వార్త తెలుసుకుని ఆయన సహచరులు, సహోద్యోగులు, సన్నిహితులు కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
2012లో అంబరీశ్, ఆషిశ్ కలిసి పెప్పర్ ఫ్రై కంపెనీని స్థాపించారు. అంబరీశ్‌కు బైక్‌పై సుదీర్ఘ ప్రయాణాలు చేయడమంటే ఇష్టం. ఆయన తరచూ ముంబై నుంచి లేహ్‌కు బైక్‌పై వెళ్తుంటారు. ఈ క్రమంలోనే లేహ్‌కు వెళ్లిన ఆయన.. నిన్న అక్కడ గుండెపోటుతో చనిపోయారు. నిన్న కొన్ని చిత్రాలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన షేర్ చేశారు.