Etala Rajender: మాకు గది కూడా ఇవ్వకపోతే.. గన్ మెన్ గదిలో కూర్చొని నోట్స్ రాసుకున్నాం: ఈటల
- స్పీకర్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసహనం
- సీఎం కేసీఆర్కు చట్ట సభల మీద విశ్వాసం సన్నగిల్లిందని విమర్శ
- ఈ ఏడాది అసెంబ్లీ జరిగింది 14 రోజులేనన్న ఈటల
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెషన్ అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించారని అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని సెటైర్ వేశారు. శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం గది కూడా ఇవ్వకుండా వివక్ష చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో, తాము గన్ మెన్ గదిలో కూర్చొని నోట్స్ రాసుకున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్కు చట్ట సభల మీద విశ్వాసం సన్నగిల్లిందనడానికి ఇటీవల జరిగిన సమావేశాలే నిదర్శనం అని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 13 పార్టీలు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, ఇప్పుడు అసెంబ్లీలో ఉంది కేవలం నాలుగు పార్టీలే అన్నారు. అందులో బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పటికీ దాన్ని బీఏసీకి పిలవకపోవడం అంటే సీఎంకు ఎంత అక్కసు ఉందో తెలుసుకోవచ్చన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 50 నుంచి 65 రోజులు సమావేశాలు జరిగేవని, ఇప్పుడు ఒక సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనని అన్నారు.
‘స్పీకర్ను మా హక్కులను కాపాడండి అని ఆడిగాం. అసెంబ్లీలో మేము ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆయన కనీసం మా మొహం కూడా చూడరు. అసెంబ్లీలో కేవలం సీఎం వైపు మాత్రమే చూస్తూ మాకు సమయం కూడా ఇవ్వరు. బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రులే అని సీఎం చెబుతారు. మిత్రపక్షమే అసెంబ్లీలో ప్రతిపక్షంగా వ్యవహరించడం దారుణం. అసెంబ్లీలో ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదు. ఎంఐఎం అడిగితే మాత్రం లేచి లేచి సమాధానాలు చెప్పారు. హరీష్ రావు మాట్లాడితే అన్నింటిలో తెలంగాణ నంబర్ వన్, కేటీఆర్ మాట్లాడితే చప్పట్లు కొట్టే వారు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనడం ర్యాగింగ్ చేయడమే. కేసీఆర్ నా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి అంటున్నాడు. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ లాంటి హామీలే ఇప్పటికి అమలు కాలేదు’’ అని ఈటల పేర్కొన్నారు.