Air India: ఎయిరిండియా పాత లోగో స్థానంలో కొత్త లోగో
- గతేడాది టాటాల వశమైన ఎయిరిండియా
- ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు
- లోగోతో సహా విమానం లోపలి డిజైన్లు, సిబ్బంది యూనిఫాం మార్పు
- ఈ నెల 10న లోగో ఆవిష్కరణ!
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థగా ఒక వెలుగు వెలిగిన ఎయిరిండియా టాటాల హస్తగతం అయిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాను కొనుగోలు చేసిన అనంతరం వ్యవస్థాగతంగా భారీ మార్పులు చేసిన టాటా సన్స్ ఇప్పుడు పాత లోగోను మార్చనుంది. ఈ నెల 10న ఎయిరిండియా కొత్త లోగోను ఆవిష్కరించనున్నారు.
పాత లోగోలో ఎరుపు రంగులోని హంస రెక్కలపై నారింజ రంగులోని కోణార్క్ చక్రం ఉంటుంది. ఇప్పుడు కొత్త లోగో... ఎయిరిండియా అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, తమ విమానాల లోపలి డిజైన్లు, సిబ్బంది యూనిఫాంలోనూ మార్పులు తీసుకురానుంది.
2022 జనవరిలో ఎయిరిండియా కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. విస్తారా ఎయిర్ లైన్స్ విలీనంతో ఎయిరిండియా భారీ సంస్థగా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి వివిధ రకాల సైజుల్లో 840 విమానాల కొనుగోలుతో చరిత్ర సృష్టించింది. రానున్న రోజుల్లో ఈ ఆర్డర్లు కార్యరూపం దాల్చనున్నాయి.