ashok gehlot: మహిళలపై అఘాయిత్యానికి పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగంలేదు: రాజస్థాన్ కీలక నిర్ణయం
- మహిళలపై నేరాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్న ముఖ్యమంత్రి
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళల భద్రతపై కఠిన సందేశం
- ప్రతి పోలీస్ స్టేషన్లో లైంగిక నేరస్థుల జాబితాను నిర్వహించనున్నట్లు వెల్లడి
రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నొక్కి చెప్పారు. తద్వారా రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని భావిస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళల భద్రతపై కఠినమైన సందేశం ఇచ్చారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి, ఆయా ఘటనలతో ప్రమేయం ఉన్నవారికి, లైంగిక దుష్ప్రవర్తన కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో లైంగిక నేరస్థుల జాబితాను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగానికి ఎంపిక చేసేముందు స్థానిక పోలీస్ స్టేషన్లు లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నడవడిక ధ్రవపత్రాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రాజస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో గెహ్లాట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.