10 year old: మరణానికి ముందు పదేళ్ల చిన్నారికి వివాహం
- అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘటన
- కేన్సర్ బారిన పడిన బాలిక
- ఎక్కువ రోజులు జీవించదని తేల్చిన వైద్యులు
- బాలిక చివరి కోరిక మేరకు పెళ్లి వేడుక
ఆ చిన్నారి కష్టం మరొకరికి రాకూడదు. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన పదేళ్ల ఎమ్మా ఎడ్వర్డ్స్ అనే బాలిక లుకేమియా (కేన్సర్) బారిన పడింది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ఉన్నట్టు 2022 ఏప్రిల్ లో వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దేవుడి దయతో తమ కూతురు కేన్సర్ మహమ్మారిని జయిస్తుందని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ ఏడాది జూన్ లో వారు షాకింగ్ సమాచారాన్ని వినాల్సి వచ్చింది. చిన్నారికి కేన్సర్ నయం కాదని, ఆమె కొన్ని రోజులకు మించి జీవించడం కష్టమని వైద్యులు స్పష్టం చేశారు.
ఈ బాధాకరమైన విషయాన్ని ఎమ్మా ఎడ్వర్డ్స్ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. పెళ్లి చేసుకోవాలన్నది ఆ చిన్నారి కోరిక. ఇక ఎక్కువ రోజులు బతకదని వైద్యులు తేల్చడంతో చిన్నారి తల్లిదండ్రులు వేగంగా వివాహ ఏర్పాట్లు చేశారు. జూన్ 29న (ఎమ్మా ఎడ్వర్డ్స్ మరణించడానికి సరిగ్గా 12 రోజుల ముందు) డీజే విలియమ్స్ అనే బాలుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఎడ్వర్డ్స్, విలియమ్స్ చిన్ననాటి నుంచి కలిసి పెరిగినవారే.
నిజానికి గతేడాది వరకు ఎమ్మా అందరి పిల్లల మాదిరే ఆరోగ్యంగా ఉండేది. గతేడాది ఒకరోజు స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కేన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అప్పటికే ఆమె ఎముకలకు కేన్సర్ కారణంగా చిల్లులు పడినట్టు బయటపడింది. నేటి మానవ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో కేన్సర్ ఒకటిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా పెద్ద సంఖ్యలో దీని కారణంగా మరణిస్తుండడం, శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.