Ambati Rambabu: చంద్రబాబుపై హత్యాయత్నం జరగలేదు.. ఆయన ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు: అంబటి
- పోలవరం వైఎస్ కలల ప్రాజెక్ట్.. చంద్రబాబు తన బ్రెయిన్ చైల్డ్ అంటున్నారని ఆగ్రహం
- సెల్ పోన్ కనిపెట్టిన చంద్రబాబుకు సెల్ఫీ తీసుకోవడం కష్టమవుతోందని ఎద్దేవా
- పోలవరం ప్రాజెక్టుపై బాబు, రామోజీరావు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు
ఎన్టీఆర్ కంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్ప నటుడని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పోలవరంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇది వైఎస్ కలల ప్రాజెక్టు అని, కానీ చంద్రబాబు తన బ్రెయిన్ చైల్డ్ అంటున్నారన్నారు. వైఎస్ ప్రారంభించకుంటే పోలవరం ఉండేది కాదన్నారు. ప్రాజెక్టులపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బురద జల్లుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, సెల్ఫీలు తీసుకున్నారని, సెల్ ఫోన్ కనిపెట్టిన బాబుకు సెల్ఫీ తీసుకోవడం కష్టమవుతోందని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు, రామోజీరావు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏదో జరిగిపోతున్నట్లు రామోజీ రావు తప్పుడు రాతలు రాస్తున్నారని, పోలవరంపై ఎప్పుడూ మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. దోచుకోవడం, దాచుకోవడం చంద్రబాబు హయాంలో జరిగిందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తాము ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని తెలిపారు. తన వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని చంద్రబాబు అంతరాత్మ చెప్పి ఉంటుందని, అందుకే సందర్శించారన్నారు.
పుంగనూరు ఘటనపై కూడా అంబటి స్పందించారు. ఈ కేసులో చంద్రబాబుపై కేసు పెట్టకపోతే రాజ్యాంగం లేనట్లే అన్నారు. చంద్రబాబు సమక్షంలోనే... పోలీసులు, వైసీపీ శ్రేణులపై దాడులు జరిగాయన్నారు. ఒక కానిస్టేబుల్ కళ్లు పోయాయని, దీనికి బాధ్యులెవరో చెప్పాలన్నారు. పుంగనూరులో చంద్రబాబుపై హత్యాయత్నం జరగలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ వద్దన్న చంద్రబాబు ఇప్పుడు పుంగనూరు ఘటనపై సీబీఐ విచారణ అడగటం సిగ్గుచేటన్నారు. ఆయన హయాంలో ముద్రగడ పద్మనాభంను హింసించారన్నారు. బ్రో సినిమా గురించి స్పందిస్తూ... ఈ సినిమాలో తనను కించపరిచారా? లేదా? ప్రజలు చెప్పాలన్నారు. తాను సినిమాల గురించి పట్టించుకోనన్నారు.