USA: లక్ అంటే ఇదీ! లాటరీలో ఏకంగా రూ.13 వేల కోట్ల గెలుపు
- అమెరికా మెగా మిలియన్స్ లాటరీలో జాక్‌పాట్ కొట్టిన ఫ్లోరిడా వాసి
- మంగళవారం నిర్వహించిన డ్రాలో ఏకంగా 1.58 బిలియన్ డాలర్ల గెలుపు
- ఈ మొత్తాన్ని 30 ఏళ్ల పాటు ఏటా కొంత మొత్తం చొప్పున చెల్లించనున్న లాటరీ నిర్వాహకులు
- ఒకేసారి లాటరీ మొత్తం తీసుకోవాలనుకుంటే లబ్ధిదారుడికి దక్కేది రూ. 6,488 కోట్లు
అమెరికాలో ఓ వ్యక్తిని అసాధారణ అదృష్టం వరించింది. అతడు లాటరీలో ఏకంగా 1.58 బిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు 13 వేల కోట్లకు సమానం. అతడి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.
ఫ్లోరిడాలోని నెప్యూన్ బీచ్‌లోని పబ్లిక్స్ స్టోర్‌లో అతడు ఇటీవల మెగా మిలియన్ లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు. మంగళవారం తీసిన డ్రాలో విజేతగా నిలిచాడు. అతడు కొన్న 13,19,20,32,33,14 నంబరు గల టిక్కెట్టుకు జాక్‌పాట్ దక్కినట్టు నిర్వాహకులు ప్రకటించారు.
అమెరికా చరిత్రలో అతడు గెలుచుకున్న లాటరీ మొత్తం మూడో అతిపెద్దదని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, లాటరీ నిర్వాహకులు ఈ మొత్తాన్ని 30 ఏళ్ల పాటు ఏటా కొంత మొత్తం చొప్పున లబ్ధిదారుడికి చెల్లిస్తారు. ఏకమొత్తంగా తీసుకోవాలనుకంటే అతడికి 783.3 మిలియన్ డాలర్లు(రూ.6,488 కోట్లు) మాత్రమే వస్తుందని నిర్వాహకులు తెలిపారు.