Bhola Shankar: చిరంజీవి 'భోళాశంకర్' విడుదలపై తీవ్ర ఉత్కంఠ.. కాసేపట్లో వెలువడనున్న కోర్టు తీర్పు
- సినిమా విడుదలను ఆపేయాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ
- నిర్మాతలైన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తనకు రూ. 30 కోట్లు ఇవ్వాలన్న పిటిషనర్
- 'భోళాశంకర్' విడుదలకు 15 రోజుల ముందు డబ్బులు ఇస్తామని చెప్పి, మాట తప్పారని ఆరోపణ
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో మెగా ఫ్యాన్స్ సందడి మొదలయింది. మరోవైపు ఈ చిత్రం విడుదలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. చిత్ర నిర్మాతలు తనను మోసం చేశారని, సినిమా విడుదలను ఆపాలని కోర్టులో పిటిషన్ వేశారు.
అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమా సమయంలో ఈ చిత్ర నిర్మాతలు తనను మోసం చేశారని పిటిషన్ లో సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తనకు రూ. 30 కోట్లు ఇవ్వాలని అన్నారు. 'భోళాశంకర్' సినిమా విడుదలకు 15 రోజుల ముందు డబ్బులు ఇస్తామని చెప్పి, మాట తప్పారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీంతో తనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఇరువైపు వాదనలు ముగిశాయి. కాసేపట్లో కోర్టు తీర్పును వెలువరించనుంది. దీంతో సినిమా విడుదలపై ఇటు అభిమానుల్లోనే కాకుండా, అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఉత్కంఠ నెలకొంది.