Vangaveeti Radha: ముఖ్య అనుచరులతో సమావేశమైన వంగవీటి రాధా.. కీలక ప్రకటన చేసే అవకాశం!
- పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ అవుతున్న రాధా
- టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీట్ ను ఆశిస్తున్న యువనేత
- జనసేనలో చేరాలని రాధాకు సూచిస్తున్న కొందరు సన్నిహితులు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వంగవీటి రాధా మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఆయన తన ముఖ్య అనుచరులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమావేశానంతరం ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని సమాచారం.
ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్ గా లేరు. విజయవాడ సెంట్రల్ సీటును రాధా అడిగినట్టు... అయితే ఆ స్థానంలో బొండా ఉమా ఉండటంతో రాధా వినతిని పార్టీ అగ్ర నాయకత్వం తిరస్కరించినట్టు తెలుస్తోంది. వేరే నియోజకవర్గం టికెట్ ను రాధాకు హైకమాండ్ సూచించినట్టు తెలుస్తోంది.
గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ టికెట్ ను రాధా కోరారు. ఆ స్థానం టికెట్ ను జగన్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇంకోవైపు జనసేనలో చేరాలని రాధాకు సన్నిహితులు సూచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఓ కార్యక్రమంలో కొడాలి నానిని రాధా కలిశారు. దీంతో, ఆయన మళ్లీ వైసీపీలోకి వెళ్లవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారాలన్నింటి నేపథ్యంలో, ఈనాటి సమావేశంలో రాధా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెపుతున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.