Bhavesh Bhatia: అంధుడైనా కంపెనీ పెట్టి 3500 మందికి ఉపాధి: ఆనంద్ మహీంద్రా పోస్ట్
- మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త స్వయంకృషి
- దీన్ని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- ఇంత కాలం అతడి గురించి తనకు తెలియకపోవడం విచారకరమన్న భావన
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా స్ఫూర్తినిచ్చే ఓ కథనాన్ని ట్విట్టర్ లో తన ఫాలోవర్లతో పంచుకున్నారు. వీధి పక్కన కొవ్వొత్తులు విక్రయించునే అంధుడైన ఓ చిరు వ్యాపారి రూ.350 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి, 3,500 మంది అంధులకు ఉపాధి కల్పిస్తున్నట్టు ఈ కథనంలోని అంశం. తన దృష్టికి వచ్చిన వాటిల్లో, అత్యంత స్ఫూర్తినీయంగా అనిపించింది ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా దీన్ని పంచుకున్నారు.
అతడి పేరు భవేష్ చందూలాల్ భాటియా (52). రెటీనా మాక్యులర్ డీజనరేషన్ కారణంగా పుట్టుకతోనే చాలా వరకు చూపు దెబ్బతిన్నది. అయినా కానీ, చూపు లేదని బాధపడుతూ ఉండి పోలేదు. ఎంతో మంది జీవితాలకు తాను వెలుగునివ్వాలని నిర్ణయించుకున్నారు. 1994లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో సన్ రైజ్ క్యాండిల్స్ పేరుతో కొవ్వొత్తుల పరిశ్రమ స్థాపించారు. ఇప్పుడు ఈ సంస్థ 14 రాష్ట్రాల పరిధిలో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. 3,500 మంది అంధులకు భాటియా ఉపాధి కల్పించారు.
ఇదే ఆనంద్ మహీంద్రాను కట్టిపడేసింది. ‘‘ఇప్పటి వరకు చూసిన అత్యంత స్ఫూర్తినీయ సందేశం ఇదే. ఇప్పటి వరకు నేను భవేష్ గురించి వినకపోవడం పట్ల విచారంగా ఉంది. ఎన్నో యూనికార్ల కంటే ఇతడి స్టార్టప్ ఎక్కువ మందిని పరిశ్రమల వైపు ప్రోత్సహించగలదు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రతిభ దాగి ఉండలేదంటూ కొందరు యూజర్లు తమ స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.