Team India: స్టార్ క్రికెటర్ జడేజాకు ఐదు నెలల్లో మూడుసార్లు డోప్ పరీక్ష
- భారత క్రికెటర్లందరిలో అతని నుంచే ఎక్కువ శాంపిల్స్ సేకరించిన నాడా
- ఈ సమయంలో రోహిత్, కోహ్లీ శాంపిల్స్ తీసుకోని వైనం
- ఐదు నెలల్లో మొత్తంగా 55 నమూనాల సేకరణ
భారత జట్టు క్రికెటర్లలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) తరచూ పరీక్షిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు భారత క్రికెటర్లలో అత్యధికంగా జడేజాకు మూడు సార్లు డోప్ టెస్టు నిర్వహించింది. ఈ కాలంలో అతని నుంచి మూడుసార్లు యూరిన్ శాంపిల్స్‌ను సేకరించినట్లు నాడా ప్రకటించింది. కాగా, ఈ ఐదు నెలల కాలంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఒక్కసారి కూడా నమూనా సేకరించకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ 2021, 2022లో ఒక్కసారి కూడా డోప్ పరీక్షకు హాజరు కాలేదు.
ఏప్రిల్‌లో హార్దిక్ పాండ్యా యూరిన్ శాంపిల్‌ను సేకరించి పరీక్షించారు. నాడా 2021, 2022లో భారత క్రికెటర్ల నుంచి వరుసగా 54, 60 నమూనాలను సేకరించింది. అయితే, ఈ ఏడాది వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మే వరకే ఏకంగా 55 నమూనాలను సేకరించడం గమనార్హం. అయితే, ఇందులో ఒక్కటి కూడా డోప్ పరీక్షలో పట్టుబడలేదు. ఈ ఏడాది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఒక్కోసారి డోప్ పరీక్షకు హాజరయ్యారు.