Corona Virus: భారత్ లోకి ఎంటరైన కొవిడ్ కొత్త వేరియంట్.. ఆ రాష్ట్రంలో కేసులు గుర్తించిన వైద్యులు
- మహారాష్ట్రలో కొత్తరకం కేసులు గుర్తించినట్లు వెల్లడి
- యూకేలో వేగంగా వ్యాపిస్తున్న ఈజీ.5 వేరియంట్
- అగ్రరాజ్యం అమెరికాలోనూ కలకలం సృష్టిస్తున్న కొత్త కేసులు
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కథ ముగిసిందని భావిస్తున్న సమయంలో యూకేలో కొత్త వేరియంట్ కేసులు వేగంగా వ్యాపించడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈజీ.5 వేరియంట్ గా వ్యవహరిస్తున్న ఈ కొత్త వేరియంట్ యూకేతో పాటు ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోనూ ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్ లోకి కూడా ఈ వేరియంట్ ఎంటరైందని వైద్యులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో ఈజీ.5 వేరియంట్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఎరిస్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్ కేసులు మే నెలలోనే బయటపడ్డాయని చెప్పారు. అయితే, ఇప్పటికి రెండు నెలలు గడిచినా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించకపోవడం కొంత ఊరటేనని వివరించారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. జులై చివరి నాటికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 70.. ఆగస్టులో యాక్టివ్ కేసుల సంఖ్య 115 కు పెరిగిందని చెప్పారు. గత సోమవారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 109కి తగ్గిందని అధికారులు తెలిపారు.
వైద్యాధికారుల లెక్కల ప్రకారం.. ముంబైలో గరిష్ఠంగా 43 కేసులు, పూణెలో 34, థానేలో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాయ్‌ఘఢ్, సాంగ్లీ, షోలాపూర్, సతారా, పాల్ఘర్‌లో ఒక్కో యాక్టివ్ కేసు నమోదైంది. మరోవైపు, పూణెలో గడిచిన పదిహేను రోజుల్లో 10 కేసులు నమోదు కాగా ఇందులో ఒక బాధితుడు చనిపోయాడని వైద్యాధికారులు తెలిపారు. అయితే, వైరస్ లక్షణాల్లో తీవ్రత పెద్దగా కనిపించలేదని, బాధితులు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదని వివరించారు.
కొత్త వేరియంట్ లక్షణాలు..
ఒమిక్రాన్ వేరియంట్ లో కలిగిన జన్యుమార్పులతోనే ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్ బాధితుల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలే కనిపిస్తాయని వివరించారు. ముక్కుకారడం, తుమ్ములు, విపరీతమైన తలనొప్పి, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు.