Jayalalithaa: అసెంబ్లీలో జయలలిత చీర లాగితే.. డీఎంకే ఎమ్మెల్యేలు నవ్వారు: నిర్మలా సీతారామన్

Jayalalithaa saree was pulled in assembly DMK MLAs laughed at her Nirmala Sitharaman
  • నిండు సభలో ప్రతిపక్ష నేతని డీఎంకే అవమానించిందన్న ఆర్థిక మంత్రి
  • చూస్తూ ఎందుకు ఉండిపోయారంటూ ఎంపీ కనిమొళినికి ప్రశ్న
  • మహిళలపై అఘాయిత్యాలను సీరియస్ గా తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ
తమిళనాడు అసెంబ్లీలో మాజీ సీఎం జయలలితకు జరిగిన ఘోర అవమానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. మణిపూర్ లో మహిళల పట్ల జరిగిన అరాచక ఘటనల నేపథ్యంలో కేంద్ర సర్కారు విఫలమైందంటూ కాంగ్రెస్ తోపాటు దాని మిత్ర పక్షాలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిపై లోక్ సభలో నిర్వహిస్తున్న చర్చలో భాగంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. 

‘‘మహిళ అన్ని చోట్ల బాధితురాలిగా ఉంటుందన్న దాన్ని నేను అంగీకరిస్తాను. మణిపూర్, ఢిల్లీ, రాజస్తాన్ ఘటనలను సీరియస్ గా తీసుకోవాల్సిందే. కానీ రాజకీయాలు చేయకూడదు. తమిళనాడు అసెంబ్లీలో 1989 మార్చి 25న జరిగిన ఒక సంఘటన గురించి నేను ఈ సభ మొత్తానికి గుర్తు చేయాలని అనుకుంటున్నాను. 

అప్పుడు జయలలిత సీఎంగా లేరు. ఆమె సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీర లాగారు. డీఎంకే సభ్యులు ఆమె పట్ల హేళనగా నవ్వారు. జయలలితను డీఎంకే మరిచిపోయిందా? మీరు ఆమె చీరను లాగేశారు. ఆమెను కించపరిచారు. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు తిరిగి సభకు రాకూడదని ఆమె ఆ రోజు తీర్మానించుకున్నారు. రెండేళ్ల తర్వాత సీఎంగా ఆమె సభలో అడుగుపెట్టారు’’ అని నిర్మలా సీతారామన్ అవిశ్వాసానికి మద్దతు పలికిన పార్టీల్లో ఒకటైన డీఎంకే తీరుని ఏకిపారేశారు. అసెంబ్లీలో జయలలితను అవమానిస్తుంటే చూస్తూ ఎలా ఉన్నారంటూ డీఎంకే ఎంపీ కనిమొళిని మంత్రి నిలదీశారు.
Jayalalithaa
saree
pulled
assembly
dmk
Nirmala Sitharaman

More Telugu News