Pawan Kalyan: వాలంటీర్లకు ఓటీపీతో పనేంటి?: పవన్ కల్యాణ్

Pawan Kalyan once again talks about volunteers

  • విశాఖలో పవన్ సభ
  • వాలంటీర్ వ్యవస్థపై మరోసారి వ్యాఖ్యలు
  • కొందరు వాలంటీర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపాటు 
  • వాలంటీర్ల పొట్టకొట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టీకరణ
  • వాలంటీర్లు డేటా సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యలు

ప్రజల డేటా దుర్వినియోగానికి ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కారణమవుతోందంటూ పోరాటం ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఎన్ని విమర్శలు వచ్చినా ఎక్కడా తగ్గేదేలేదంటున్నారు. ఇవాళ విశాఖ సభలోనూ పవన్ వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. 

వాలంటీర్లకు ఓటీపీతో పనేంటి? అని ప్రశ్నించారు. ఓటీపీ అడిగి మొన్న రాజమండ్రిలో డబ్బు దోచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కొయ్యలగూడెంలో ఒక వాలంటీర్ మహిళ వేలిముద్రతో బ్యాంక్ నుంచి రూ.1.70 లక్షలు దోచేశాడని వివరించారు. పెందుర్తిలో ఒక వాలంటీర్ వృద్ధురాలిని చంపి నగలు దోచేశారని తెలిపారు. వాలంటీర్లు డేటా సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. 

జగన్ వాలంటీర్లతో, ప్రభుత్వ ఉద్యోగులతో తప్పులు చేయిస్తున్నాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. గతంలోనూ అన్న, అక్క అంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తప్పులు చేయించి, వారు జైలుకు వెళ్లడానికి కారకుడయ్యాడని ఆరోపించారు. 

"నేను వాలంటీర్ వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడాను. సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నా... వాలంటీర్ల పొట్టకొట్టాలన్నది నా ఉద్దేశం కాదు. అవసరమైతే ఇంకో రూ.5 వేలు ఎక్కువగా ఇచ్చే వ్యక్తిని నేను. కానీ మీతో జగన్ తప్పు చేయిస్తున్న విషయాన్ని గుర్తించండి. ప్రజల నుంచి సేకరించిన ఆధార్, బ్యాంక్, ఇతర వివరాలను నానక్ రామ్ గూడలోని ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి అప్పగిస్తున్నారు" అని స్పష్టం చేశారు.

మన రాష్ట్రంలో 30 వేల మందికి పైగా మహిళలు, అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోయారని నేను చెబితే వైసీపీ గూండాలు తిట్టారు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్పానని, నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి కూడా ఆ విషయాన్ని బలపరుస్తూ, హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఏపీ 3వ స్థానంలో ఉందని తెలిపారని వివరించారు. ముఖ్యంగా విశాఖ నుంచి ఎక్కువమంది అక్రమ రవాణాకు గురైనట్టు తెలిపారని వెల్లడించారు. మొన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News