Kota Tragedy: ‘కోటా’లో రాలిపోతున్న విద్యార్థులు.. మరో విద్యార్థి ఆత్మహత్య
- ఈ ఏడాది ఇప్పటి వరకు 21 మంది విద్యార్థుల ఆత్మహత్య
- గతేడాదిని మించిపోయిన మరణాలు
- దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఆత్మహత్యలు
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరస ఆత్మహత్యలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. వారి మరణాల వెనకున్న మిస్టరీ ఏంటో అర్థంకాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. గురువారం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గతవారం రోజుల్లో ఇది మూడో ఘటన కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని అజాంగఢ్‌కు చెందిన 17 ఏళ్ల మనీశ్ ప్రజాపత్ కోటాలోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్‌లో గత ఆరు నెలలుగా జేఈఈ కోసం శిక్షణ పొందుతున్నాడు. నిన్న అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా మారాడు. అతడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా కేసుతో కలుపుకుని ఇప్పటి వరకు ఈ ఏడాది 21 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒత్తిడే ప్రధాన కారణమన్న వార్తలు వినిపిస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు నిర్ధరాంచలేదు. కాగా, గతేడాది కూడా 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుందని అంచనా. ఈసారి ఆ సంఖ్య మించిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.