Andhra Pradesh: అర్చకుడిపై దాడిని ఖండించిన సాధినేని యామిని
- వైసీపీ నేతలు అధికారమదంతో వ్యవహరిస్తున్నారని విమర్శ
- అర్చకుడిపై దాడి సనాతన ధర్మంపై దాడేనని ఆరోపణ
- హిందుత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలను తిప్పికొడతామని హెచ్చరిక
పంచారామాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిపై దాడిని బీజేపీ నేత సాధినేని యామిని శర్మ ఖండించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఓ ప్రణాళిక ప్రకారం హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అర్చకుడు నాగేంద్ర పవన్ పై ఆలయ బోర్డు చైర్మన్ భర్త యుగంధర్ దాడి చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ హిందూ సనాతన ధర్మంపై దాడేనని యామిని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, హిందుత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలను తిప్పికొడతారని హెచ్చరించారు.
అధికార పార్టీకి చెందిన యుగంధర్.. అధికార మదంతో, ఏంచేసినా చెల్లుతుందనే ధోరణితో అర్చకుడిపై దాడి చేశారని యామిని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఆడవారిపైన, హిందుత్వంపైన దాడులు పెరిగాయని ఆరోపించారు. ఆలయ అర్చకుడు నాగేంద్ర పవన్ పై దాడి చేసి, ఆయన యజ్ఞోపవీతాన్ని తెంచడాన్ని బీజేపీ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. ఈ దాడి ఘటనపై హిందూ వర్గాలు ముఖ్యంగా బ్రాహ్మణ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయని యామిని తెలిపారు.