Team India: తిలక్ వర్మ ప్రపంచ కప్ లో ఆడుతాడా.. రోహిత్ శర్మ స్పందన ఇదే!
- అరంగేట్రంలో సత్తా చాటుతున్న తిలక్ వర్మ
- విండీస్ తో మూడు టీ20ల్లో ఆకట్టుకున్న యువ ఆటగాడు
- తిలక్ ను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలంటున్న అశ్విన్, ఎమ్మెస్కే ప్రసాద్
టీమిండియా అరంగేట్రంలో హైదరాబాద్ యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ జట్టుతో టీ20 సిరీస్ లో ఆడిన తొలి మూడు మ్యాచ్ ల్లో సత్తా చాటాడు. అతని ఆటకు పలువురు సీనియర్లు, మాజీలు ఫిదా అవుతున్నారు. తిలక్ ను ప్రపంచ కప్ లో ఆడే భారత జట్టులోకి తీసుకోవాలని స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సూచించారు. దీనిపై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. తిలక్ ను ప్రపంచ కప్ లో ఆడించే విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా అతని ఆటను రోహిత్ ప్రశంసించాడు.
మూడు మ్యాచ్ లతోనే తిలక్ వర్మ జట్టులో నమ్మదగ్గ ఆటగాడిగా మారాడని చెప్పాడు. ఆట పట్ల అతనికి చాలా కసి ఉందన్నాడు. ఈ వయసులో అంత పరిణతితో ఆడటం అరుదైన విషయం అని కొనియాడాడు. అతని బ్యాటింగ్ ముచ్చటగా ఉంటుందన్నాడు. అయితే, అతను ప్రపంచ కప్ లో ఆడే విషయం తనకు తెలియదన్నాడు. ఇప్పటికే తిలక్ చాలా ప్రతిభావంతుడనే విషయం నిరూపితమైందని రోహిత్ చెప్పాడు. మిగతా విషయాలను సెలెక్టర్లు చూసుకుంటారని అభిప్రాయపడ్డాడు.