Botsa Satyanarayana: వచ్చే ఉగాది నాటికి జనసేన పార్టీ ఉంటే గుండు గీయించుకుంటా: మంత్రి బొత్స
- వచ్చే ఏడాది నాటికి జనసేనతో పాటు టీడీపీ ఉండవని బొత్స వ్యాఖ్య
- ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఆ పార్టీలకు లేదన్న మంత్రి
- ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు స్కీములు గుర్తుకు వస్తాయని వెల్లడి
- చెప్పులు ఎవరికి ఉండవు.. అందరికీ ఉంటాయని ఎద్దేవా
వచ్చే ఉగాది నాటికి జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉండవని, ఈ రెండు ఉంటే కనుక తాను గుండు కొట్టించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఆ పార్టీలకు లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు స్కీములు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కొంతమంది నేతలు మాట్లాడితే చేతులు, కాళ్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుతో కొడతామని విపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ... చెప్పులు ఎవరికి ఉండవు.. అందరికీ ఉంటాయన్నారు.
నీ విధానం ఏమిటి, పార్టీ ఏమిటి అంటే జనసేనాని వద్ద సమాధానం లేదన్నారు. రాజకీయ దుకాణం తెరిచి పదిహేనేళ్లయిందని ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై కూడా మాట మార్చారన్నారు. అసలు నువ్వు ఎవరు.. నీ స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. ఈ రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలు అంటేనే అసహ్యమేస్తోందన్నారు.