Onion buffer stock: ఉల్లి ధర నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం
- గోదాముల్లో ఉల్లి బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటన
- ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయనున్న కేంద్రం
- ఈ-వేలం, ఈ-కామర్స్ వంటి రిటైల్ విక్రయమార్గాల ద్వారా మార్కెట్లోకి ఉల్లి
దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. గోదాముల్లో బఫర్ స్టాక్‌గా నిల్వచేసిన ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గల ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లిపాయలను సరఫరా చేసేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ ఏడాది అత్యధిక ధరలు నమోదైన ప్రాంతాలతో పాటూ దేశంలో సగటు ఉల్లి ధర కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గత నెలలో పోలిస్తే అధిక ధర చూసిన ప్రాంతాలకు వీటిని సరఫరా చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ-వేలం, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది.
ధరల నియంత్రణకు కేంద్రం ఉల్లిని సేకరించి బఫర్ స్టాక్‌గా గోదాముల్లో నిల్వ ఉంచుతుంది. ఉల్లిపాయల సరఫరా తగ్గి ధరలు పెరిగిన సందర్భాల్లో వీటిని మార్కెట్లోకి విడుదల చేసి ధరల పెరుగుదల కట్టడికి కృషి చేస్తుంది. ఈ ఏడాది 3 లక్షల టన్నుల మేర ఉల్లి సేకరణ జరిగింది.